ఎమ్మెల్యేలకు జీతాలు ... విద్యార్థులకు మొండి చెయ్యా ...!
- పెండింగ్లో వున్న ఫీజు బకాయిలను వెంటనే చెల్లించాలి
- పీడీయస్ యూ నేత వంగూరి వెంకటేష్ డిమాండ్
- ఖమ్మంలో భట్టి, తుమ్మల క్యాంపు కార్యాలయాల ముట్టడి
- నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఫీజు బకాయలు చెల్లించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని పీడీయస్ యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగూరి వెంకటేష్ విమర్శించారు. నెల నెలా ఎమ్మెల్యేలకు జీతాలు చెల్లించే ప్రభుత్వం, విద్యార్థులకు ఎందుకు మొండి చేయి చూపిస్తుందని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై విద్యార్థులు రాజీలేని పోరాటానికి సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, రియంబర్స్మెంట్ రూ. 8000 కోట్లు, బెస్ట్ అవైలబుల్ రూ. 200 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు. అప్రమత్తమైన పోలీసులు పీడీయస్ యూ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా వంగూరి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటుందని విమర్శించారు. గత మూడు సంవత్సరాల నుండి విద్యార్థులకు రావలసిన బెస్ట్ అవైలబుల్, ఫీజు బకాయలను చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని మండి పడ్డారు. విద్యార్ధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోని పక్షంలో కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతే రేవంత్ రెడ్డి సర్కార్ కు పడుతుందని హెచ్చరించారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్ రాక పోవడంతో ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని ఒత్తిడి చేస్తున్నా ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేక పోవడం బాధాకరమన్నారు. రియంబర్స్మెంట్ పథకాన్ని నిర్లక్ష్యం చేసి భవిష్యత్తులో ఎత్తి వేయడం కోసమే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రవర్తిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ ఫీజులను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అలాగే, ప్రభుత్వ కాలేజీల్లో చదివివే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు ఉచిత బస్సు పాస్సులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్, జిల్లా నాయకులు వినయ్, కార్తీక్, పృథ్వి, సురేష్, నసీర్, చందు, అశోక్, ప్రసాద్, పేర్ల వెంకటేష్, నరేంద్ర ర్, వరుణ్, సంతోష్, అఖిల్ స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment